సంస్కృత సంధులు

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు. పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది

సంధులు సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని రెండు రకాలు. సంస్కృత పదాలకు వచ్చేవి, తెలుగు పదాలకు వచ్చేవి అని భావం.

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. 
ఉదా:
రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం


2. గుణ సంధి: అకారానికి ఇ-ఉ-ఋలు పరమైతే క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశ మవడాన్ని గుణసంధి అంటారు. 
ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు
ఇతర + ఇతర = ఇతరేతర 
రాజ + ఋషి = రాజర్షి

3. వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు. 
ఉదా:
భువన + ఏక = భువనైక 
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం
పాప + ఓఘం = పాపౌఘం
పరమ + ఔషధం = పరమౌషధం 
ఋణ + ఋణం = ఋణార్ణం

4. యణాదేశ సంధి: ఇ-ఉ-ఋలకు అసవర్ణా చ్చులు పరమైతే క్రమంగా య-వ-రలు ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు. ‘‘ఇకోయణచిః’’ : ఇక్కులకు (ఇ-ఉ-ఋ) యణ్ణులు (య-వ-ర) పరమవుతున్నందు వల్ల ఇది యణాదేశ సంధి. 
ఉదా: 
జయంతి + ఉత్సవం = జయంత్యుత్సవం
హిందూ + ఆర్యులు = హింద్వార్యులు
పితృ + ఆర్జితం = పిత్రార్జితం

5. జశ్త్వ సంధి: క-చ-ట-త-పలకు అచ్చులు కానీ, హ-య-వ-ర-లు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశమవడాన్ని జశ్త్వసంధి అంటారు. 
ఉదా:
తత్ + అరణ్య భూములు = తదరణ్య భూములు
అచ్ + అంతం = అజంతం
వాక్ + ఈశుడు = వాగీశుడు
కకుప్ + అంతం = కకుబంతం
సత్ + భావం = సద్భావం

6. శ్చుత్వ సంధి: సకారత వర్గాలకు శకారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు. 
(సకార-త థ ద ధ న) (త వర్గం)
(శకార – చ ఛ జ ఝ ఞ) (చవర్గం)
తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)
సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) – చ= చ్ఛ)
సత్+జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)
విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి (త్ (త)+ శ=చ్ఛ)

7. అనునాసిక సంధి: వర్గ ప్రథమాక్షరాలకు (క-చ-ట-త-ప)‘న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి. 
ఉదా:
వాక్ + మయం = వాఙ్మయం (క-ఙ=నిత్యం)
జగత్ + నాటకం = జగన్నాటకం = జగద్నాటకం (వికల్పం)
(అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరం) (త-ద-వికల్పం)
మృట్ + మయం = మృణ్మయం, మృడ్మయం (టకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పం)


8. విసర్గ సంధి: అకారం పూర్వముందున్న విసర్గకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అ-హ-య-వ-ర-లలు పరమైనప్పుడు విసర్గ – ఓకారంగా మారుతుంది. (వర్గ తృతీయాక్షరాలు- గ, జ, డ, బ, లు వర్గ చతుర్థాక్షరాలు (ఘ, ఝ, ఢ, ధ, భ, లు) 
వర్గ పంచమాక్షరాలు: ఙ- ఞ- ణ- న-మ్ (అనునాసికాలు) హ-య-వ-ర-లలు పరమైనప్పుడు మాత్రమే విసర్గ ఓకారంగా మారుతుంది. కొన్నిసార్లు రేఫ వస్తుంది. 
ఉదా: 
అయః + మయం = అయోమయం (యః + మ = ఓ) 
ఇతః + అధికం = ఇతోధికం (తః+అ = ఓ)
చతుః + ఆత్మ = చతురాత్మ (తుః + ఆ = ‘ర’ కారం వచ్చింది) 
తపః ఫలము = తపఃఫలం (ఫ కారం వర్గ ద్వితీయాక్షరమైనందు వల్ల విసర్గలో మార్పు లేదు).

9. పర సవర్ణ సంధి: పదాంతం ముందున్న ‘త’ కారానికి లకారం పరమైనప్పుడు ‘ల’ కారమే ఆదేశంగా రావడాన్ని పర సవర్ణ సంధి అంటారు. (త్ – తకారానికి లకారం వస్తే ‘ల్ల’ కారం వస్తుంది) 
ఉదా: 
భగవత్ + లీల = భగవల్లీల (త్ + ల = ల్ల)
ఉత్ + లేఖనం = ఉల్లేఖనం (త్+లే = ల్లే)
విద్యుత్ + లత = విద్యుల్లత (త్ + ల = ల్ల)
సుహృత్ + లాభం = సుహృల్లాభం (త్ + లా = ల్లా)


10. పరరూప సంధి: హల్లుల్లోని అకారానికి అకారం పరమైతే రెండో పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమవుతుంది. దీన్ని పరరూపసంధి అంటారు. 
ఉదా: 
సార + అంగము = సారంగము
(ర్ + అ = రకారంలోని అకారానికి ‘అ’ కారం పరమై రకారానికి దీర్ఘం వచ్చింది) 
సీమ + అంతము = సీమంతము 
(మ్ + అకారానికి అకారం పరమై అకార దీర్ఘం వచ్చింది)